Chandrababu: గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది..! 1 y ago
AP : పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా తణుకు ఎన్టీఆర్ పార్కు వద్ద ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య కార్మికుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తణుకు కూరగాయల మార్కెట్‌ను పరిశీలించి, కూరగాయల వ్యర్థాల నుంచి ఎరువుల తయారీపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, కనీసం మురికి కాలువల్లో పూడిక కూడా తీయించలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం, అభివృద్ధి చేస్తూ ముందుకెళుతోందని, నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని తెలిపారు. సౌత్‌లో తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం ఏపీనే అని, తాను చేపట్టిన చర్యలతోనే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు.
పెన్షన్లు పెంచిన ఘనత టీడీపీదే అని, మొదటిసారి మధ్య తరగతి వారికి రూ. 2 లక్షల వరకు బీమా కల్పించి ఆదుకున్నామన్నారు. అపరిశుభ్ర వాతావరణంతోనే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అందుకే స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి నుంచి అర్జీ తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామని, పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీకి అధికారం ఇస్తే ఏపీని అంధకారంలోకి నెట్టేశారని, ఐదేళ్లలో విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. గత సీఎం ఎప్పుడు ప్రజల్లో తిరగలేదని, ఒకవేళ బయటకు వస్తే పరదాలు కట్టుకుని వచ్చేవారని విమర్శించారు.